సమాధి కట్టేందుకు కూడా ఇసుక దొరకనివ్వడం లేదు
ఎమ్మెల్యేలకు, వైసీపీ నేతలకు ఇసుక ఆదాయ వనరుగా మారింది
ఇసుక దోపిడీ డబ్బంతా ఎక్కడికి పోతోంది.. జగన్ సమాధానం చెప్పాలి
మీ వలన రైతులు, కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు
మాజీ మంత్రి పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ ఆగ్రహం
బత్తలపల్లి మండలం నల్లబోయినపల్లి ఇసుక రీచ్ వద్ద టీడీపీ నేతలతో కలసి నిరసన
శ్రీ సత్యసాయి జిల్లా బ్యూరో ,ఆగస్ట్ 28, అనంత జనశక్తి న్యూస్
ఎమ్మెల్యేలు, వైసీపీ నాయకుల ఇసుక దోపిడీకి హద్దే లేకుండా పోయిందని.. మాజీ మంత్రి పరిటాల సునీత, ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకు.. శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం నల్లబోయినపల్లి ఇసుక రీచ్ వద్ద నిరసన చేపట్టారు. ముందుగా రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల టీడీపీ నేతలతో కలసి ఇసుక రీచ్ ను పరిశీలించారు. దీని వలన కులుగుతున్న నష్టాన్ని కూడా అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాసేపు ఇసుక రీచ్ వద్ద ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ వైసీపీ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం.. రాష్ట్రంలో సామాన్యులకు ఇసుక దొరక్కుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇష్టానుసారంగా నదుల్లో ఇసుక తవ్వకాలు చేస్తున్న కారణంగా భూగర్భజలాలు అడుగంటిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. అలా అని సామాన్యులకైనా ఇసుక దొరుకుతుందా అంటే అది కూడా లేకుండా చేశారన్నారు. దీని వలన భవన నిర్మాణ రంగం కుదేలైందని.. కార్మికులకు ఉపాధి లేకపోయిందన్నారు. ప్రభుత్వం జేపీ కంపెనీ ద్వారా ఇసుక అమ్ముతున్నది టన్ను 475రూపాయలని.. కానీ బయట సదరు కంపెనీ అమ్ముతున్నది ఏకంగా 2వేల నుంచి 5వేల వరకు ఉందన్నారు. ఈ సొమ్ముంతా ఎవరి ఖాతాల్లోకి చేరుతోందని ప్రశ్నించారు. ధర్మవరం నియోజకవర్గంలో చిత్రావతి నదిలో అలాగే పేరూరు జలాశయంలో ఇసుక దోపిడీ కారణంగా అక్కడ భూమి కుంగిపోయి.. ప్రమాదకరంగా మారుతోందన్నారు. ఇష్టానుసారంగా వందలాది టిప్పర్లతో ఇతర ప్రాంతాలకు ఇసుక తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సామాన్యుడు ఎద్దుల బండ్లపై ఇసుక తీసుకెళ్తే.. పోలీసులు కేసులు పెడుతున్నారని.. కానీ అక్రమంగా కర్ణాటకకు తరలిస్తుంటే ఏమీ మాట్లాడరని విమర్శించారు. చివరకు సమాధి కట్టుకునేందుకు కూడా ఇసుక ఇవ్వడం లేదంటూ సునీత ధ్వజమెత్తారు….
*బాప్ ఏక్ నెంబరీ… బెటా దస్ నెంబరీ.. అన్నట్టుగా జగన్, కేతిరెడ్డిల పరిస్థితి ఉంది.. పరిటాల శ్రీరామ్*
చిత్రావతి నదిలో ఇసుక దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోయిందని.. ధర్మవరం నియోజకవర్గ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ ప్రాంతాల్లోని చిత్రావతి నదిలో ఇష్టానుసారంగా ఇసుక తవ్వేయడం వలన ఇక్కడి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలకు, వైసీపీ నాయకులకు ఇది ఒక ఆదాయ వనరుగా మారిందన్నారు. లక్ష్మీనారాయణ అనే రైతు ఇసుక తవ్వకం వలన తన పొలం దెబ్బతింటోందని ప్రశ్నిస్తే.. ఆయనపై కేసులు పెట్టారన్నారు. గరిశనపల్లిలో కూడా ఇసుక తవ్వకాల వలన స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. నదిలో బోర్ల ద్వారా గత కొన్నేళ్లుగా 18గ్రామాలకు నీరందిస్తున్నారని.. అయితే ఈ ఇసుక తవ్వకాల వలన బోర్లు ఎండిపోయే పరిస్థితి వస్తోందన్నారు. ఇలా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసి దోపిడీ చేస్తున్న ఇసుక డబ్బంతా తమ జేబుల్లోకి వేసుకుంటున్నారన్నారు. దీనిపై సీఎం జగన్ బయటకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బాప్ ఎక్ నెంబరీ.. బెటా దస్ నెంబరీ తరహాలో సీఎం జగన్ అలా చేస్తుంటే.. ఇక్కడ కేతిరెడ్డి అంతకు మించిన అక్రమాలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. ఈ ఇసుక దోపిడీ విషయంలో వెనుక ఉండి నడిపిస్తున్నది ఎవరో ఎమ్మెల్యే చెప్పాలన్నారు. ఇసుక, మద్యం ద్వారా దోపిడీ చేస్తూ.. ఆ డబ్బును పక్కదారి పట్టిస్తూ.. సంక్షేమ పథకాల్లో కోతలు విధిస్తున్నారని శ్రీరామ్ మండిపడ్డారు. మీరు చేస్తున్న ఈ దోపిడీతో ప్రజలకు ఎన్నో పథకాలు అందివ్వచ్చని సూచించారు..