ఉపాధి హామీ కూలీల సంఖ్యను పెంచాలి
అమ్మాయిలను బాగా చదివించాలి
:జిల్లా కలెక్టర్ ఎమ్. గౌతమి
అనంతపురము,మే,27 :అనంత జనశక్తి న్యూస్
ఉపాధి హామీ కూలీల సంఖ్యను పెంచాలని జిల్లా కలెక్టర్ ఎమ్. గౌతమి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం పుట్లూరు మండలం, కందికాపుల పంచాయతీ, చింతకుంట గ్రామ సమీపంలో ఉపాధిహామీ పథకం కింద సుబ్బరాయసాగర్ నుండి పుట్లూరు చెరువు వరకు చేపడుతున్న ప్రధాన కాలువలో పూడికతీత, తదితర పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అక్కడి ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతూ, కాలవ పనులను ఎన్ని రోజుల నుంచి చేపడుతున్నారు. కూలీ డబ్బులు సక్రమంగా అందుతున్నాయా? లేదా? ఆరా తీశారు. ఇప్పటివరకు చేసిన పనులకు తమ ఖాతాలలో కూలీ డబ్బులు జమ అవుతోందని తమసంతోషాన్ని వ్యక్తం చేశారు.వంద రోజులు పూర్తి అయ్యేంతవరకు ఉపాధి హామీ కూలీ పనులకుహాజరవుతా మన్నారు. ఒకరోజు కూలి సుమారు 220 రూపాయల వరకు వస్తుందని కలెక్టర్ కు వారు తెలిపారు. వేజ్ లిస్టు ,మస్టర్ ఆధారంగా కొందరి ఉపాధి హామీ కూలీల పేర్లను పిలిచి హాజరునుపరిశీలించారు. ఈ సందర్భంగా డిమాండ్ రైజ్ చేసిన మేరకు సగం మంది కూలీలు ఎందుకు రాలేదని అధికారులను ప్రశ్నించారు. ఆ ప్రాంతంలో ఉన్న పండ్లతోటలలో వారు పనులుచేస్తున్నందున వారు హాజరు కాలేదన్నారు. ఉపాధి పనులకు మరింత మంది కూలీలు హాజరయ్యేలా వారికి అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.ఉపాధి హామీ కూలీల కుటుంబ స్థితిగతులపై వారితో ముచ్చటిస్తూ, వారి అమ్మాయిలను బాగా చదివించాలని కోరారు. ప్రస్తుతం ఆడపిల్లలే అని రంగాల్లో ముందంజలో ఉన్నారని, జిల్లాలో అన్నింటా అమ్మాయిలే ర్యాంకులు సాధిస్తున్నారని, వారిని బాగా చదివిస్తే వారు మరింతగా ఉన్నత స్థానానికి చేరుకొని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొస్తారన్నారు.వర్షాకాలంలో సుబ్బరాయ సాగర్ నుండి కాలవలో నీరు వస్తుందని,ఈ కాలువ దాటుతూ తాము తమ గ్రామాలకు వెళ్ళవలసి ఉన్నందున ఇక్కడ కల్వర్టు నిర్మించాల్సిందిగా గ్రామస్తులు జిల్లా కలెక్టర్ ను కోరారు. అందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఎంపీడీవోను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో అనంతపురం ఆర్డీవో మధుసూదన్ ,ఏపీడి వెంకటరత్నం, డిఎల్డిఓ ఓబులమ్మ,పుట్లూరు మండల తహసిల్దార్ సుమతి,ఎంపీడీవో యోగానంద రెడ్డి, ఏపీవోలు చెన్నకేశవులు, భాగ్యలక్ష్మి చింతకుంట గ్రామసర్పంచ్ కె. శివరామయ్య, ఇంచార్జ్ జేఈ విజయ్, తదితరులు పాల్గొన్నారు.