టీడీపీ బలపడిందా….
– బలపడ్డామన్న భ్రమలో ఉందా…!
– క్షేత్రస్థాయిలో పూర్తి కాని కమిటీలు
– పార్టీకి ఆయువు పట్టు అయిన కమిటీల పై శీతల కన్ను..
– బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ యువత, రైతు సంఘం వంటి కమిటీల పూర్తయ్యేది ఎన్నడో
అనంతపురం, జూన్ 22, అనంత జనశక్తి న్యూస్;
అధికార పక్షం జనాల్లో రోజురోజుకు బలహీన పడుతూ తన నమ్మకాన్ని కోల్పోతుంది. బలంగా నిలవాల్సిన ప్రతిపక్ష నేతలు అధికార పక్షం కన్నా నీరసించిపోతుందనడంలో అతిశయోక్తి లేదు. ఓటరు మార్పు కోసం సంసిద్ధంగా ఉన్న ప్రతిపక్ష నేతలు మాత్రం వారిని ఆకట్టుకోలేక నిరాశ నిస్పృహల మధ్య ఊగిసలాడుతున్నారనే చెప్పవచ్చు. పార్టీకి మూల స్తంభాలు అనుబంధ కమిటీలు, ఇప్పటికి జిల్లాలో కమిటీల ప్రక్రియ నత్తనడకన సాగుతొందని ఆ పార్టీ వర్గాల్లో చర్చ. బూతు కమిటీలు మినహా మిగిలిన అనుబంధ సంఘాల కమిటీలు ఏర్పాటు ప్రక్రియ నామమాత్రమే. గ్రామస్థాయి నుండి పార్టీని పటిష్ట పరచాలంటే గ్రామ కమిటీల ప్రక్రియ చాలా కీలకం. అలాంటి ఈ ప్రక్రియ చాలా చోట్ల పూర్తి కాకపోవడం పై పార్టీ వర్గాల్లో తీవ్ర నిరాశనెలకొంది. పార్టీకి ఆయువు పట్టైన మండల కమిటీలను కూడా నియమించడంలో జిల్లా నాయకత్వముతో పాటు నియోజకవర్గ నాయకులు విఫలమయ్యారన్న వాదనలు లేకపోలేదు. దీనికి ప్రధాన కారణం నాయకుల మధ్య నెలకొన్న సమన్వయ లోపంతో పాటు, ఆదిపత్య పోరు కూడ ఓ కారణమని చెప్పవచ్చు. అధిష్టానం క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టపరచాలంటూ ఎప్పటికప్పటికీ జిల్లా అధినాయకత్వానికి ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికి జిల్లా నాయకులు మాత్రం వాటి అమలులో ఆసక్తి చూపడం లేదన్న విమర్శలు లేకపోలేదు. ఎన్నికల సమయంలో పార్టీ కోసం పని చేయాలంటే ఆయా సామాజిక వర్గాలకు చెందిన కమిటీలలోని నాయకులే కీలకం.
*పూర్తి కానీ అనుబంధ సంఘాల…*
ఏ పార్టీకైనా కీలకం క్షేత్రస్థాయిలోని కమిటీలే. ఎంతో చారిత్రకత ఉన్న తెలుగుదేశం పార్టీకి గతంలో పూర్వవైభవాన్ని తెచ్చింది ఆయా సామాజిక వర్గాల చెందిన కమిటీలు, నాయకులే. ప్రస్తుత అధికార పార్టీతో ఢీ కొట్టాలంటే తెలుగుదేశం పార్టీకి క్షేత్రస్థాయిలో గ్రామ కమిటీలు, అనుబంధ సంఘాల కమిటీలు కీలకం. మరి వీటి ఏర్పాటులో జిల్లా నాయకులు ఎందుకు అలసత్వం వహిస్తున్నారు అన్నది మాత్రం ప్రశ్నార్థకం. శింగనమల నియోజకవర్గంలో ఇప్పటికీ చాలా మండలాల్లో కమిటీల ప్రక్రియ ఆగిపోయింది యల్లనూరు, పుట్లూరు, నార్పల, శింగనమల, బుక్కరాయసముద్రం వంటి మండలాలకు మండల కమిటీలను నియమించకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. నార్పల మండలంలో మండల కమిటీ ఏర్పాటు చేసే సమయంలో నాయకుల అధిపత్య పోరులో దాడులు ప్రతిదారులకు పాల్పడ్డ సంఘటనలు లేకపోలేదు. దీంతో నేటికి నియోజకవర్గంలో కమిటీల ప్రక్రియ ఆగిపోయిందని చెప్పవచ్చు. దీనికి తోడు పక్క నియోజకవర్గాల్లోని నాయకుల పెత్తనం కూడా ఓ కారణమీ అన్న వాదనలు లేకపోలేదు. అయితే ప్రస్తుతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, యువత, రైతు సంఘం వంటి విభాగాలకు చెందిన కమిటీల ఏర్పాటు ప్రక్రియ పూర్తయ్యేది ఎన్నడో, క్షేత్రస్థాయిలో పార్టీ బలపడేది ఎన్నడో అన్న అయోమయ పరిస్థితి ద్వితీయ శ్రేణి నాయకుల్లో నెలకొందని, ప్రస్తుతం వారు సైతం గ్రామాల్లో మౌనాన్నే ప్రదర్శిస్తున్నారన్న చర్చ లేకపోలేదు.