ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం పేదల పక్షాల నిలుస్తూ సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. ఇదే సమయంలో అభివృద్ధిని కూడా పరుగు పెట్టిస్తున్నట్లు చెప్పారు. కానీ కొందరు కుట్ర రాజకీయాలు చేస్తున్నారని, వాటిని ఛేదిద్దామని పిలుపునిచ్చారు. అధికారంలో ఉండగా ఏమీ చేయలేని తెలుగుదేశం పార్టీ నేతలు.. ఇప్పుడు మంచి చేస్తున్న ప్రభుత్వంపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. శుక్రవారం మునిసిపల్ కార్యాలయంలో నిర్వహించిన ‘వాలంటీర్లకు వందనం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనంత మాట్లాడారు. వాలంటీర్లు నిస్వార్థ సేవకులని కొనియాడారు. దేశ చరిత్రలో సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి సరికొత్త విప్లవాన్ని సీఎం జగన్ సృష్టించారని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఇప్పటికే 98 శాతం అమలు చేశామని చెప్పారు. కొన్ని చిన్న చిన్న సమస్యలను కూడా కొందరు భూతద్దంలో చూపిస్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియాలోనూ దుష్ప్రచారం చేస్తున్నారని, వీటిని సమర్థవంతంగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు వాలంటీర్ వ్యవస్థపై అసత్య ప్రచారం చేశారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు వాలంటీర్లను తాము కూడా కొనసాగిస్తామని చెబుతున్నారంటే మీరు చేస్తున్న సేవలే అందుకు కారణమని చెప్పారు. కోవిడ్, వరదలు వంటి విపత్కర పరిస్థితుల్లోనూ వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు ప్రాణాలకు తెగించి పని చేశారన్నారు. కుటుంబ సభ్యుల్లో ఒకరిగా కలిసిపోయి సేవలు చేస్తున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ హయాంలో జన్మభూమి కమిటీలు దోపిడీ చేస్తే వైసీపీ వచ్చాక సచివాలయ వ్యవస్థతో అర్హతే ప్రామాణికంగా పథకాలు అందుతున్నాయని చెప్పారు. సూర్యుడు ఉదయించకముందే ఒకటో తేదీనే నేరుగా ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లు అందిస్తున్న ఘనత వాలంటీర్లదని కొనియాడారు. కొందరు రాజకీయ స్వలాభం కోసం వాలంటీర్లపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అలాంటి వాటిని పట్టించుకోవద్దని సూచించారు. సంక్షేమ పథకాలతో పాటు అనంతపురం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మరోసారి జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకుందామని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అంటే అధికారం చెలాయించడానికి లేదని.. ప్రజలకు సేవ చేయడానికి ఉందని సీఎం జగన్ నిరూపించారని తెలిపారు. వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు భవిష్యత్‌లోనూ బాగా పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. అనంతరం డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్‌రెడ్డి, జేసీఎస్ కన్వీనర్ కొండ్రెడ్డి ప్రకాష్‌రెడ్డి, కార్పొరేటర్లు రాజేశ్వరి, శాంతి సుధ, శేఖర్‌బాబు తదితరులు వాలంటీర్ల సేవలను కొనియాడారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధుల్లా వాలంటీర్లు నిలుస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో నగర పాలక సంస్థ సెక్రటరీ సంగం శ్రీనివాసులు, కార్పొరేటర్లు చంద్రలేఖ, జయలలిత, రహంతుల్లా, ఇసాక్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.