శింగణమలలో పట్టు సడలుతున్న టీడీపీ…
– ఆధిపత్య పోరులో ఓటమి తప్పదా …!
– ఇంచార్జ్ కాదన్నా…కాతరు చేయని బండారు
– టికెట్ నాదే…లేకుంటే తిరుగుబాటే…?
– కార్యకర్తలతో ఆడుకుంటున్న అధిష్టానం
– విసిగెత్తి పోతున్న కార్యకర్తలు
– వర్గపోరును అధిష్టానం నిలువరిస్తుందా
– అధిష్టాన మౌనం దేనికి సంకేతం
అనంతపురం , జులై 6, అనంత జనశక్తి న్యూస్;
శింగనమల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తన పట్టును సడలుతోందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. 2016 సంవత్సరంలో పునర్విభజన అయినప్పటినుండి నియోజకవర్గంలో ఒక్కసారి మాత్రమే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపొందడం జరిగింది. ఇక్కడున్న ప్రధాన సెంటిమెంటు ఏమిటంటే ఎవరైతే నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుపొందుతారో ఆ పార్టీ మాత్రమే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. అటువంటి ఈ నియోజకవర్గంపై తెలుగుదేశం పార్టీ అధిష్టానం మాత్రం ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోకుండా తాస్కారం చేస్తూ కాలయాపన చేస్తుండటంతో నియోజకవర్గంలోని ప్రతి నాయకుడు తామే నాయకులమన్న చందంగా వ్యవహరిస్తూ వర్గ పోరుకు నాంది పలికారు. దీంతో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గంలో గెలుస్తుందా…? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ఎన్నికలలో టీడీపీ అధిష్టానం ఎన్నికలు జరిగే సమయంలో అభ్యర్థిని ప్రకటించిడంతో ఓటమిని చవి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కోల్పోయి నాలుగు సంవత్సరాలు అవుతున్న ఈ నియోజకవర్గానికి ఇన్చార్జి ని నియమించలేని దుస్థితిలో పార్టీ అదిష్టానం ఉందా లేక పార్టీకి అభ్యర్థులు కరువయ్యారా అన్న చర్చ నియోజకవర్గం లేకపోలేదు.
మంది ఎక్కువైతే మజ్జిగ పలుచనా..
మంది ఎక్కువైతే మజ్జిగ పలుచన అన్న చందంగా నియోజకవర్గంలో టిడిపి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి వ్యతిరేక పవనాలు వీస్తుండటం, ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీ వైపే చూస్తుండటంతో పార్టీ అధిష్టానానికి నియోజకవర్గం పై అయోమయ పరిస్థితిలో పడిందన్న విమర్శలు లేకపోలేదు. అధిష్టానం శైలు కోసం వేచి చూస్తోంద, లేక సిద్ధంగా ఉన్న నాయకులను నిరీక్షింప చేస్తోందా. మొత్తంగా చూస్తే టికెట్ కోసం అభ్యర్థుల సంఖ్య పెరుగుతుండటంతో వారి ఎంపిక విషయంలో పార్టీ అధిష్టానం పూర్తి గందరగోళంగా ఉందన్న చర్చ లేకపోలేదు. దీనికి తోడు ఎవరికి వారు గ్రూపు రాజకీయాలకు తెరలేపడంతో ఒకరికి టికెట్ ఇస్తే మరో వర్గం పార్టీకి సహకరిస్తుందా..! సహకరించకపోతే పరిస్థితి ఏంటి…? ఈ నియోజకవర్గానికి ఉన్న సెంటిమెంట్ తిరగబడితే రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఏంటి…? అన్న డోలాయమాన స్థితిలో అధిష్టానం ఉందన్న చర్చ లేకపోలేదు.
గందరగోళంగా పార్టీ దుస్థితి….
శింగనమల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి పూర్తిగందరగోళంగా మారిందని, ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా నాయకుల తీరు మారడంతో నియోజకవర్గంలో పార్టీకి తీవ్ర గడ్డు కాలం నెలకొంది. 2019 ఎన్నికలలో అభ్యర్థిగా పోటీ చేసిన బండారు శ్రావణి ఓటమి అనంతరం ఇన్చార్జిగా కొనసాగింది. రెండు సంవత్సరాల పాటు అధిష్టానం మౌనం వహించిగా, అనంతరం అధికార పక్షం పై విమర్శలను ఎక్కుపెడుతూ వచ్చింది. కానీ నియోజకవర్గంలో మాత్రం పార్టీ పరిస్థితి స్పృహ లేని స్థితిలో ఉండడంతో ఇన్చార్జ్ స్థానంలో టూ మెన్ కమిటీని పార్టీ అధిష్టానం నియమించడం జరిగింది. నియోజకవర్గంలో పార్టీని చక్కదిద్దడం వీరి బాధ్యత. అయితే వీరు కూడా పార్టీని పటిష్ట పరచడంలో విఫలమయ్యారన్న విమర్శలు లేకపోలేదు. నియోజకవర్గంలోని కొందరు నాయకుల తీరుతో టూమెన్ కమిటీ సైతం తమకేల అన్న చందంగా వ్యవహరిస్తుండడం తో పార్టీ పరిస్థితి పూర్తి భిన్నంగా మారిందని, దింతో నియోజకవర్గంలోని టిడిపి నేతలు, కార్యకర్తలు పూర్తిగా గందరగోళానికి గురవుతున్నారనడంలో అతిశయోక్తి లేకపోలేదు. నియమించబడ్డ టూ మ్యాన్ కమిటీకి సైతం వర్గ పోరు సెగ తగలడంతో వారు కూడా పూర్తి స్థాయిలో అనుబంధ కమిటీలను కూడా నియమించలేని పరిస్థితి నెలకొందని ఆ పార్టీ నేతలు తమ అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేస్తున్నారు.
కాతరు చేయని బండారు…
శింగనమల నియోజకవర్గానికి ఇంచార్జ్ ఎవరూ లేరని, ప్రస్తుతం పార్టీ ఆదేశాల మేరకు టూమెన్ కమిటీని నియమించడం జరిగింది. పార్టీ కార్యక్రమాలను టూమెన్ కమిటీ ఆధ్వర్యంలోనే జరుగుతాయని ఇటీవల నియోజకవర్గ పరిశీలకుడు ముక్తార్ జిల్లా కేంద్రంలో జరిగిన ఓ సమావేశంలో తెలిపారు. అయితే బండారు శ్రావణి శ్రీ మాత్రం వారి మాటలను ఖాతరు చేయడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ కార్యక్రమాలను వేరుగా నిర్వహించడం, పోస్టర్లలోనూ, పత్రికలలోనూ ఇంచార్జ్ అంటూ వేయించడం జరుగుతూనె ఉంది. దీన్ని బట్టి చూస్తే బండారు శ్రావణి శ్రీ పార్టీ నిర్ణయాన్ని ఖాతర్ చేయడం లేదని, తనకు పార్టీ ముఖ్యం కాదని గత ఎన్నికలలో తాను పూర్తిగా నష్టపోయానని ప్రస్తుతం తనను కాదని మరొకరికి అవకాశం ఇస్తే తిరుగుబాటు చేసేందుకు కూడా తన కార్యాచరణను సిద్ధం చేసుకున్నట్లు ఆమె వర్గీయుల చర్చించుకోవడం విశేషం. ఇందులో భాగంగానే బండారు శ్రావణి గత మూడు నెలలుగా తన జోష్ ను పెంచిందనడంలో అతిశయోక్తి లేదు.
అధిష్టాన మౌనం దేనికి సంకేతం…
నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉన్న నడిపించే నాయకత్వం లేకపోవడంతో పార్టీ పరిస్థితి గోరంగా మారిందని, భవిష్యత్తులో పార్టీకి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదంటే బలమైన వాడిని, కార్యకర్తలకు నేనున్నానంటూ భరోసా ఇచ్చే నాయకుడిని అభ్యర్థిగా నియమించేందుకు పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంటున్నట్లు విశ్వాసనీయ సమాచారం. ఇందులో భాగంగానే ఎవరు పార్టీకి నష్టం చేకూరుస్తున్నారో రాబిన్ టీం ద్వారా నియోజకవర్గం పై పూర్తి సమాచారంతో అధిష్టానం మౌనంగా ఉన్నట్లు సమాచారం.