కాపుల ఐక్యత దెబ్బ తీయడానికి కుట్
వైసీపీ మైండ్ గేమ్ లో కాపులు పడొద్దు
కాపులకు వైసీపీ చేసింది ఏమీ లేదు
పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలవాలి
కాకినాడ మీడియా సమావేశంలో నగర జనసేన అధ్యక్షులు తోట సుధీర్
కాకినాడ సెప్టెంబర్ 21, అనంత జనశక్తి న్యూస్
వైసీపీ నాయకులు ఆడుతున్న మైండ్ గేమ్ లో కాపులు పడొద్దని, మనలో మనకి చీలిక తెచ్చి రాజ్యాధికారం అందకుండా చేసే ప్రయత్నంలో భాగంగానే కాపులతో సమావేశాలు నిర్వహిస్తున్నారని జనసేన పార్టీ కాకినాడ సిటీ అధ్యక్షులు శ్రీ తోట సుధీర్ పేర్కొన్నారు. ఎవరికి ఓటు వేయాలో, ఎవరిని అధికారంలోకి తీసుకురావాలో కాపులకు బాగా తెలుసని అన్నారు.
గురువారం కాకినాడలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ తోట సుధీర్ మాట్లాడుతూ… “జనసేన పార్టీ ముఖ్య ఉద్దేశమే కులాల ఐక్యత. దశాబ్దాలుగా రాజ్యాధికారానికి దూరంగా ఉన్న కులాలకు రాజ్యాధికారం రావాలంటే కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఆ దిశగానే ఆయన అడుగులు వేస్తున్నారు. అలాంటి వ్యక్తికి మద్దతుగా నిలబడటం మన బాధ్యత.
*ముఖ్యమంత్రి కాపులకు చేసింది ఏమిటి?*
కాపులకు రిజర్వేషన్ ఇవ్వడం కుదరదని ముఖ్యమంత్రి జగన్ తెగేసి చెప్పారు. కాపు కార్పొరేషన్ పేరుతో హడావుడి తప్ప ఒక్క రూపాయి అయినా నిధులు విదిల్చారా? దీనిపై వైసీపీ పార్టీలో ఉన్న కాపు నాయకులు ఎందుకు మాట్లాడటం లేదు? రిజర్వేషన్ ఇవ్వడం కుదరదని చెప్పిన వ్యక్తిని నమ్మడం ఎంత వరకూ సబబు? కొంతమంది వైసీపీ నాయకులు తమ స్వార్ధ, రాజకీయ ప్రయోజనాల కోసం కాపుల్లో ఐక్యత దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తున్నారు. వారి కుట్రలను భగ్నం చేయాల్సిన అవసరం మనందరిపై ఉంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా కాపులు అందరూ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నాను” అన్నారు. ఈ సమావేశంలో పెద్దాపురం ఇంఛార్జ్ శ్రీ తుమ్మల బాబు, ఉమ్మడి తూ.గో.జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ తలాటం సత్య తదితరులు పాల్గొన్నారు.