. అమరావతిలో పేదలకు సీఎం జగన్ ‘పట్టా’భిషేకం..
50,793 మంది పేదలకు ఇళ్ల పట్టాలు.. 5,024 టీడ్కో ఇళ్ల పంపిణీ
అమరావతిలో పేదలకు ఇళ్లు సామాజిక న్యాయానికి ప్రతీకక
నరకాసుడినైన నమ్మండి.. కానీ చంద్రబాబుని నమ్మద్దు: సీఎం జగన్
“పేదల కోసం న్యాయ పోరాటం చేశాం.. విజయం సాధించాం.. ఇప్పుడు రూ. ఏడు లక్షల నుంచి 10 లక్షల విలువ చేసే ఇంటి స్థలం.. నా పేద అక్కచెల్లెమ్మల పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తున్నాం.. అమరావతి ఇక మీద సామాజిక అమరావతి అవుతుంది. మన అందరి అమరావతి అవుతుంది. దేశ చరిత్రలో ఈ కార్యక్రమానికి ఓ ప్రత్యేకత ఉంది. పేదలకు ఇళ్ల పట్టాలు వద్దని కోర్టులకెక్కి అడ్డుకున్నారు. పేదల కోసం సుప్రీంకోర్టులో ప్రభుత్వమే న్యాయపోరాటం చేసింది. ఇది పేదల విజయమని సీఎం జగన్ అభివర్ణించారు. ఇవి ఇళ్ల పట్టాలే కాదు.. సామాజిక, న్యాయ పత్రాలు కూడా. సామాజిక అమరావతే.. మనందరి అమరావతి. 50, 793 మంది పేదలకు ఇళ్ల స్థలాలు అందజేస్తున్నాం. సీఆర్డీఏ పరిధిలో 1,402.58 ఎకరాల్లో మొత్తం 25 లేఅవుట్లలో ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. వారం పాటు ఇళ్ల పట్టాల పండు కార్యక్రమం ఉంటుందని, ఇళ్లు కట్టడానికి బీజం కూడా ఈ వారంలోనే పడుతుంది “అని సీఎం జగన్ ప్రకటించారు.
అమరావతిలో 50,793 మంది పేదల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నాడు వెంకటపాలెం గ్రామంలో జరిగిన బహిరంగ సభ నుంచి సీఎం జగన్ ప్రసంగించారు. “ఈ అద్భుతమైన కార్యక్రమానికి రోహిణి కార్తెలో మండె ఎండలను కూడా లెక్క చేయకుండా మనసు నిండా మమకారంతో చిక్కటి చిరునవ్వులతో ఆప్యాయతలు, ఆత్మీయతలను పంచి పెడుతున్న ప్రతి ఒక్కరికీ ముందుగా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నానను.
ఈ రోజు ఈ సభకు ఈ సందర్భానికి ఈ కార్యక్రమానికి మన రాష్ట్ర చరిత్రలోనే కా కుండా దేశ చరిత్రలో కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే.. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని జరిగిన వందలు, వేల పోరాటాలు చూశాం. ఈ 75 ఏళ్ల స్వతంత్య్ర భారత దేశంలో ఇలాంటి పోరాటాలు చూసే ఉంటాం. కానీ ప్రభుత్వమే పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని సుదీర్ఘ న్యాయ పోరాటం చేసి సుప్రీం కోర్టు దాకా వెళ్లి మరి 50 వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్న ఈ పండుగ, ఈ చారిత్రక ఘట్టాన్ని ఈ రోజు ఇక్కడ అమరావతిలోనే చూస్తున్నాం” అని హర్షం వ్యక్తం చేశారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా.. జులై 8వ తేదీన ఇళ్లు కట్టించే కార్యక్రమం చేపడతామని సీఎం వైయస్ జగన్ ప్రకటించారు.
పేదలకు రూ.10 లక్షలు విలువైన ఇళ్ల స్థలాలు
ఈ రోజు అక్షరాల ఇక్కడ 50,793 మంది నా అక్కచెల్లెమ్మలకు వాళ్ల పేరు మీద ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నామని, ఇంత మంచి అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు నేను మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే, సురేష్‌ను అడిగాను. ఈ ప్రాంతంలో గజం ఉజ్జాయింపుగా రేటు ఎంత ఉండవచ్చు అని అడిగాను. వేలంలో గజం రూ.17 వేలు పలికింది. అంటే దానర్థం రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షలు విలువ చేసే ఇంటి స్థలం ఈ రోజు నా అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ చేయిస్తున్నానని చెప్పడానికి ఇంతకంటే సంతోషం ఏముంటుందని పేర్కొన్నారు.
*ఇవి ఇళ్ల పట్టాలు మాత్రమే కాదు.. సామాజిక న్యాయ పత్రాలు*
అమరావతి ఇక నుంచి సామాజిక అమరావతి, అందరి అమరావతి అవుతుంద’న్నారు. ఇంకా ‘దేశ చరిత్రలోనే అమరావతి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఓ ప్రత్యేకత ఉందన్నారు. పేదల కోసం సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేసి విజయం సాధించామని పేర్కొన్నారు. మన ప్రభుత్వమే సుదీర్ఘంగా న్యాయపోరాటం చేసిందని పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుంటా కుట్రలు చేసి కోర్టులకెళ్లి మరీ అడ్డుకునే యత్నం చేశారని చెప్పారు. కానీ మనకు అనుకూలంగానే తీర్పు వచ్చిందిని ఇది పేదల విజయమని పేర్కొన్నారు.
వారం రోజుల పాటు పండగలా ఈ కార్యక్రమం
ఈ కార్యక్రమం మరో వారం రోజుల పాటు పండగలా జరుగుతుందని ప్రతి లే అవుట్ దగ్గరకు వెళ్లి ప్రతి అక్కచెల్లెమ్మలను తీసుకెళ్లి, వారికి అక్కడే ఇళ్ల పత్రాలు ఇచ్చి, అక్కడే ఫోటో తీసుకుంటామని పేర్కొన్నారు. చిక్కటి చిరునవ్వులతో జియో ట్యాగింగ్ పూర్తి చేసి నా అక్కచెల్లెమ్మలకు ఇళ్లు కట్టించే కార్యక్రమం ఈ వారం రోజుల్లోనే చేపడతామని తెలిపారు. ఈ ఇళ్ల నిర్మాణాలకు అవవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ..ప్రతి అక్కచెల్లెమ్మలను అక్కడికి తీసుకెళ్లి వారికి ఇంటి పత్రాలు ఇచ్చి, ఫోటోలు తీయించి, వాళ్లతో జీయో ట్యాగింగ్ చేసి ఇళ్లు మంజూరు చేస్తామని జులై 8వ తేదీన అంటే నాన్నగారి జయంతి రోజున ఇల్లు కట్టించే కార్యక్రమం మొదలవుతుందని చెప్పారు.
ఇళ్ల నిర్మాణం పై నా అక్కచెల్లెమ్మలకే ఆప్షన్లు
ఇల్లు కట్టుకోవాలంటే ఏ పద్ధతిలో కట్టుకుంటారోనని ప్రతి ఒక్కరికి మూడు ఆప్షన్లు ఉంటాయన్నారు.
మొదటి ఆప్షన్.. ఎవరైనా సొంతంగా మేమే ఇల్లు కట్టుకుంటామని చెబితే దానికి అయ్యే ఖర్చు రూ.1.80 లక్షలు నేరుగా జమ చేస్తామని అన్నారు.
రెండో ఆప్షన్ కూడా ఇస్తామని.. తమ ఇంటి నిర్మాణం చేయించుకోవడానికి వారికి కావాల్సిన నిర్మాణ సామాగ్రి ప్రభుత్వమే అందజేయాలని అని కోరితే..దానికి ప్రభుత్వమే సిద్ధమేనని. నిర్మాణ కూలీ మొత్తాన్ని పనుల పురోగతి మేరకు నేరుగా జమ చేస్తామని పేర్కొన్నారు.
మూడో ఆప్షన్: మీరే ఏదో రకంగా ఇల్లు కట్టించమని అక్కచెల్లెమ్మలు అడిగితే.. దానికి కూడా చిరునవ్వుతో మీ అన్న సరే అంటున్నాడని ఎలా కట్టుకుంటారో మీరే ఆప్షన్ ఎంచుకోండని, ఇల్లు కట్టించే బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుందని తెలిపారు.
ఈ ఇళ్లకు కూడా మిగతా చోట చేస్తున్నట్లుగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఇల్లు కడుతున్నామో అలాగే కట్టిస్తామని, ఇసుక పూర్తిగా ఉచితంగా అందజేస్తామని తెలిపారు. సిమెంట్, స్టీల్, డోర్ ప్రేమ్‌లు ఇతర మెటీరియల్ ప్రభుత్వమే సబ్సిడీ రేటుకు, తక్కువ రేటుకు అందిస్తుందని, ప్రతి అక్కచెల్లెమ్మకు కూడా బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా కూడా ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి.. మనందరి ప్రభుత్వం వచ్చిన తరువాత దేవుడి దయతో మీ అందరి చల్లని ఆశీస్సులతో 30.70 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగిందని. ఇప్పటికే 21 లక్షల మందికి ఇళ్లు మంజూరు చేశామని, వారు ఇళ్లు కట్టుకుంటున్నారని చెప్పడానికి సంతోషపడుతున్నానని హర్షం వ్యక్తం చేశారు. దేవుడి దయతో 30.70 లక్షల ఇంటి స్థలాలు, రూ.2.50 లక్షల విలువ చేసే ఇల్లు..ఆ ప్రాంతాన్ని బట్టి ఒక్కో ఇంటి విలువ రూ.5 నుంచి రూ.10 లక్షలు ఉంటుందని తెలిపారు.30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చానని, ఆర్థికంగా ఎన్ని సవాళ్లు ఎదురైనా కూడా నవరత్నాల్లోని పథకాలు, రైతులు, అక్కచెల్లెమ్మలకు, సామాజిక వర్గాలకు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేశానని ఉద్ఘాటించారు.
నరకాసుడినైన నమ్మండి.. కానీ చంద్రబాబుని నమ్మవద్దు
ఈ రోజు రాష్ట్రంలో క్లాస్ వార్ జరుగుతోంది. ఒక వైపు పేదవాడు, మరో వైపు పెత్తందార్లు ఉన్నారని, పేదవారికి ఇళ్ల స్థలాలు ఇస్తామంటే పెత్తందార్లు ఏకంగా కోర్టుల దాకా వెళ్లి అడ్డుకుంటున్నారని విమర్శించారు. సుప్రీం కోర్టులో ఓడిపోయిన తరువాత కూడా నిన్న కూడా చంద్రబాబు రకరకాల పద్ధతిలో అడ్డుకుంటున్నారని, నరకాసుడినైన నమ్మండి.. కానీ ఆ చంద్రబాబుని నమ్మవద్దని తెలిపారు. పేదవాడు ఇంగ్లీష్ మీడియం చదువులు చదవాలని ప్రభుత్వం తాపత్రయపడుతుంటే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. నేరుగా నేను బటన్ నొక్కితే ఆ డబ్బులు మీ ఖాతాల్లోకే వెళ్తున్నాయి, దీంతో మీ పిల్లలను హాయిగా చదివించుకుంటున్నారు.. ఇలాంటివి చేస్తుంటే.. దాన్ని కూడా అడ్డుకునే కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రం శ్రీలంక మాదిరిగా అవుతుందని వార్తలు రాస్తున్నారని, చర్చలు పెడుతున్నారని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో ఇంకా మంచి చేసే పరిస్థితులు రావాలని కోరారు. మీ బతుకులు ఇంకా మారాలి. మీ బిడ్డ దేవుడి దయతో, మీ అందరి చల్లని దీవెనలతో ఇంకా మంచి చేసే పరిస్థితి రావాలని కోరుకుంటూ ..ఈ రోజు నుంచి జరుగబోయే ఈ కార్యక్రమం వారం రోజుల పాటు జరుగుతుందని మీ అందరికీ మరొక్కసారి తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.
శాసన రాజధానికి నిండైన అర్థం తెచ్చారు : ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి
రాజధాని ప్రాంతంలోని నిరుపేదలంతా ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి రుణపడి ఉంటారని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. దశాబ్దాలుగా సొంత ఇళ్లు లేని నిరుపేదలు రెండేళ్ల నిరీక్షణ తరువాత సుమారు 52 వేల మంది సీఎం వైయస్ జగన్ చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు అందుకోబోతున్నారన్నారు. ఎంతమంది ఎన్ని అడ్డంకులు సృష్టించినా సీఎం వైయస్ జగన్ సంకల్ప బలంతో రాజధాని ప్రాంత నిరుపేదలు నేడు ఇళ్ల పట్టాలు అందుకోబోతున్నారన్నారు. ఒకనాడు రాజధాని ప్రాంతంలో ఎవరైనా అద్దెకు రావాలన్నా.. నీకులం ఏంటీ అని అడిగే పరిస్థితులు చూశాం. వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఆయన అండదండలతో నా కులం మానవత్వం, నా మతం సమానత్వం అనే పరిస్థితి వచ్చింది. చంద్రబాబు ఎన్ని దుర్మార్గాలు పన్ని, రైతుల ముసుగుతో, రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కోర్టుల్లో కేసులు వేసినా కూడా ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా న్యాయానికి, ధర్మానికి, పేదవాడికి అండగా న్యాయస్థానాలు నిలబడినప్పటికీ ఎల్లో మీడియా దారుణంగా ప్రవర్తిస్తోందని దుయ్యబట్టారు.