పోలవరం ప్రాజెక్టులో చంద్రబాబు చేసింది పనులు కాదు.. భజనలు
కాఫర్ డ్యాం నిర్మించకుండా డయాఫ్రం వాల్ కట్టిన ఘనుడు చంద్రబాబు
యువగళం ఫ్లాప్‌తో ప్రజల్ని డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు యాత్రలు చేస్తున్నాడు – మంత్రి అంబటి రాంబాబు
అమరావతి ఆగస్ట్ 08,అనంత జనశక్తి ప్రతినిధి
ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్‌మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎక్కడా అలసత్వం, నిర్లక్ష్యం ప్రదర్శించలేదని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు పోలవరం పర్యటన సందర్బంగా చేసిన వ్యాఖ్యలపై మంత్రి అంబటి స్పందించారు. పోలవరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలో జరిగిన తప్పుల వల్లే పోలవరం ప్రాజెక్టు ఆలస్యం అవుతోందని మంత్రి రాంబాబు పేర్కొన్నారు. ఎలాంటి ప్రణాళిక లేకుండా డయాఫ్రం వాల్ నిర్మించడం ఆ తర్వాత అది దెబ్బతినడం వల్ల ప్రాజెక్టు పనులు ఆలస్యం అయ్యాయన్నారు.
*కాఫర్ డ్యాంలు ఎప్పుడు నిర్మించాలంటే..*
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కాఫర్ డ్యాంలు చాలా కీలకం అని మంత్రి అంబటి అన్నారు. కాఫర్ డ్యాంలు నిర్మించే ముందు నది నీరును డైవర్ట్ చేయాలని, స్ఫిల్‌వే పూర్తి చేయాలన్నారు. ఆ తర్వాత ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ఇచ్చి ముంపు గ్రామాల ప్రజలకు అన్ని వసతులు కల్పించిన తర్వాత,, కాఫర్ డ్యాంలు పూర్తి చేయాలన్నారు. అలా చేయకుండా ముందు కాఫర్ డ్యాంలు, డయాఫ్రం వాల్‌ను కడితే.. ముంపు గ్రామాలు పూర్తిగా మునిగిపోతాయని మంత్రి తెలిపారు. అందుకే సగం వరకే కాఫర్ డ్యాంలు కట్టి చంద్రబాబు చేతులు దులుపుకున్నారని ఆయన పేర్కొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్పిల్ వే, రెండు కాఫర్ డ్యాంలు పూర్తి చేశామని మంత్రి అన్నారు. ఇటీవల ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కూడా కొందరికి ఇచ్చినట్లు తెలిపారు. నది నీటిని కూడా డైవర్ట్ చేసి ప్రాజెక్టు పనులు ముమ్మరంగా సాగుతున్న క్రమంలో పనులు జరగలేదని చంద్రబాబు పచ్చి అబద్దాలు చంద్రబాబు ఆడుతున్నారని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు.
*చంద్రబాబు భజన చేయడమే సరిపోయింది..*
గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు ప్రతి సోమవారం సందర్శనలు ఏర్పాటు చేసి, సమీక్షలు పెట్టి తన బృందంతో భజన చేయించుకునే వాడని మంత్రి అంబటి ఎద్దేవా చేశారు. కేంద్రం నిర్మించాల్సిన ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వమే కడుతుందని తీసుకుని చంద్రబాబు చేతులెత్తాడని ఆరోపించారు. అంతేకాకుండా.. 2018 నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తానని ఉత్తరకుమారుడి ప్రగల్భాలు పలికారన్నారు. ఇప్పుడు వచ్చి చంద్రబాబు అబద్దాలు చెబుతూ.. అవే నిజాలని ప్రజలు నమ్మేలా చేస్తున్నాడని,, కానీ ప్రజలు చాలా తెలివైన వారని అన్నారు. ఇక చంద్రబాబు లాగా అబద్దాలు చెప్పేవాడు ఈ ప్రపంచంలో లేడని, లైవ్ డిటెక్టర్‌కు కూడా చంద్రబాబు దొరకకుండా అబద్దాలు చెప్పగలడన్నారు. అబద్దాలు చెప్పడంలో ఎవరికైనా చంద్రబాబు శిక్షణ ఇస్తాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని మంత్రి తెలిపారు.
*ప్రాజెక్టు ఎత్తు ఎక్కడా తగ్గించలేదు…*
పోలవరం పర్యటనలో ప్రాజెక్టు ఎత్తు 45.72 అడుగుల నుంచి 41.15 అడుగులకు తగ్గించినా సీఎం జగన్ మాట్లాడలేదని,, చంద్రబాబు లేనిపోని అబద్దాలను ప్రచారం చేస్తున్నాడని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. వాస్తవానికి కేంద్రం చెప్పిన ప్రకారం.. తొలుత 41.15 అడుగుల వరకు ప్రాజెక్టును నిర్మించి.. ఆ తర్వాత కొన్ని రోజులు ప్రాజెక్టుపై సమీక్షించి.. ముంపు గ్రామాల్లో ఏ విధంగా పరిస్థితి ఉంది అని తెలుసుకున్నాక.. విడదల వారీగా ప్రాజెక్టు ఎత్తు పెంచుతామని చెబితే.. దాన్ని చంద్రబాబు అన్ని విధాలుగా అనుకూలంగా మార్చుకుని మాట్లాడుతున్నారన్నారు. ప్రాజెక్టు ఎత్తును విడతల వారీగా పెంచుతారన్నారు. ముందుగా అనుకున్నదాని ప్రకారం 194 టీఎంసీల నీరు నిలబెట్టే ప్రణాళిక అమలు చేస్తామన్నారు. ఎక్కడా మార్పులు ఉండవన్నారు. ఇవన్నీ తెలిసినా చంద్రబాబు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, రకరకాల ప్రయత్నాలు చేసి ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టాడని చెప్పే చంద్రబాబు… ఆయనకు వెన్నుపోటు ఎందుకు పొడిచాడో చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. యువగళం వల్ల టీడీపీ గ్రాఫ్ పడిపోతోంది. అది తట్టుకోలేక.. ప్రజల్ని డైవర్ట్ చేయాలని ఉద్దేశంలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై చంద్రబాబు యాత్ర చేపట్టారని మంత్రి అంబటి ఫైర్ అయ్యారు. చంద్రబాబు యాత్ర ఎన్నికల ప్రచారంగా ఉన్నది తప్పా.. ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి యాత్ర చేస్తున్నట్లు లేదని ఎద్దేవా చేశారు.