గ్రూప్ -1 ఉద్యోగాల భర్తీలో ఏపీపీఎస్సీ రికార్డ్
కేవలం 11 నెలల వ్యవధిలో గ్రూప్-1 ఎంపిక ప్రక్రియ పూర్తి
విజయవాడ ఆగస్ట్ 17,అనంత జనశక్తి ప్రతినిధి
ఏపీపీఎస్సీ చరిత్రలో రికార్టు టైంలో కేవలం 11 నెలల వ్యవధిలో పూర్తి పారదర్శకంగా గ్రూప్-1 ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసిందని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతం సవాంగ్ వెల్లడించారు. మొదటిసారిగా సీసీటీవీ లైవ్ స్ట్రీమింగ్ తో పరీక్షలు నిర్వహించామన్నారు. కేవలం 19 రోజుల్లోనే ప్రిలిమ్స్ ఫలితాలను, 34 రోజుల్లోనే మెయిన్స్ పరీక్షా ఫలితాలు విడుదల చేశామన్నారు. 1:2 నిష్పత్తిలో ఇంటర్వ్యూలకు అభ్యర్థులను ఎంపిక చేశామన్నారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల్లో చాలావరకు ఐఐటీ, ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల నుంచి వచ్చినవారే ఉన్నారన్నారు. తప్పుడు సర్టిఫికెట్లతో మోసం చేయడానికి ప్రయత్నించిన ఒక అభ్యర్థిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే ఆ అభ్యర్థిపై క్రిమినల్ కేసు నమోదు చేయడం జరిగిందన్నారు.
సిలబస్‌లో కీలక మార్పులతో.. త్వరలో గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్
సిలబస్‌లో కీలక మార్పులతో త్వరలో గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదలకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. 2019 నుంచి ఇప్పటివరకు ఏపీపీఎస్సీ ద్వారా 64 నోటిఫికేషన్లు విడుదల చేశామన్నారు. 17 ఏళ్ల తర్వాత యూనివర్శిటీల్లో అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ల నియామకం చేపట్టడం చరిత్రాత్మక నిర్ణయమని, ఇందుకు సంబంధించి ఏపీపీఎస్సీ ద్వారా రిక్రూట్ మెంట్ ప్రాసెస్ చేయడం జరుగుతుందన్నారు.