చంద్రబాబు అరెస్ట్ మా కుటుంబాన్ని ఎంతో బాధించింది
అయినా తట్టుకుని నిలబడుతున్నాం.. ఆయన్ని రక్షించుకుంటాం
చంద్రబాబు తిరిగి వచ్చే వరకు మా పోరాటం కొనసాగుతుంది
పోలీసుల వ్యవహారతీరుపై మాజీ మంత్రి పరిటాల సునీత ఆగ్రహం
నేటి నుంచి నిరసనలు, దీక్షలకు సిద్ధం కావాలని పిలుపు
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తర్వాత మా కుటుంబంలో ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టుకున్నారని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. ఒక విధంగా చెప్పాలంటే.. పరిటాల రవి మరణం తరువాత మమ్మల్ని అత్యంత బాధించిన సంఘటన ఇది అన్నారు. అనంతపురం నగర శివారులోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆమె పాల్గొన్నారు. చంద్రబాబు అరెస్ట్ తదనంతర పరిణామాలపై ఆమె తీవ్రంగా స్పందించారు. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. 40ఏళ్ల రాజకీయ జీవితంలో ఎలాంటి తప్పు చేయని చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన అరెస్ట్ తరువాత టీడీపీ నేతలంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారన్నారు. లక్షలాదిమంది రోడ్ల మీదకొచ్చారన్నారు. అయితే పోలీసులు వారిని అక్రమంగా అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారన్నారు. అంటే ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసనలు తెలిపే హక్కు కూడా లేదా అని ప్రశ్నించారు. టీడీపీ కార్యకర్తలు ఎవరూ భయపడవద్దని.. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకొస్తారన్నారు. ఆయన మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని.. అక్రమ కేసులు పెట్టించిన వారి కథ చూస్తారన్నారు. అప్పటి వరకు మనమంతా లోకేష్ కు అండగా నిలుద్దామన్నారు. బుధవారం నుంచి అంతా ఐక్యంగా నిరసనలు, దీక్షలు చేద్దామని.. ప్రతి ఒక్క కార్యకర్త ఇందులో పాల్గొనాలన్నారు. ప్రజలు కూడా సంఘీభావం తెలిపాలని విజ్ఞప్తి చేశారు….