వైసీపీ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోంది
ముఖ్యంగా రైతులు, యువత, మహిళలకు నష్టం జరిగింది
ప్రజల భవిష్యత్ కు గ్యారెంటీ టీడీపీతోనే సాధ్యం
రామగిరిలో ప్రజలతో మాజీ మంత్రి పరిటాల సునీత
అనంతపురం ఆగస్ట్ 16,అనంత జనశక్తి ప్రతినిధి
వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండల కేంద్రంలో బుధవారం ఆమె భవిష్యత్ కు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల నాయకులు, స్థానిక నాయకులతో కలిసి ఇంటింటా తిరుగుతూ మినీ మ్యానిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేశారు. తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ దేవాలయం దగ్గర సెల్ఫీ తీసుకున్నారు. అలాగే ప్రస్తుతం వైకాపా ప్రభుత్వంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. ముఖ్యంగా ఈప్రభుత్వంలో అభివృద్ధి అన్నది ఎక్కడా లేదని స్థానికులు అన్నారు. సంక్షేమ కార్యక్రమాలు కేవలం కొందరికే అందుతున్నాయన్నారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి టీడీపీ అధినేత చంద్రబాబు మినీ మ్యానిఫెస్టోను రూపొందించారన్నారు. వారికి భవిష్యత్ లో ఎలాంటి కష్టాలు లేకుండా చేయడానికి ఆరు అద్భుతమైన పథకాలు తీసుకొచ్చారన్నారు. వీటిలో ముఖ్యంగా మహిళలకు మంచి జరిగే విధంగా పథకాలు ఉన్నాయన్నారు. అమ్మకు వందనం, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, మూడు ఉచిత గ్యాస్ సిలిండర్, నెల నెలా ఆర్థిక సాయం వంటివి ఉన్నాయన్నారు. రైతులకు ప్రతి యేటా పెట్టుబడి సాయంతో పాటు యువతకు ఉద్యోగాల కల్పన, నిరుద్యోగ భృతి వంటివి ఉన్నాయన్నారు. అన్ని అంశాలు మీరు పరిశీలించుకోవాలన్నారు. టీడీపీ హయాంలో పాలన ఎలా ఉంది.. ఇప్పుడు వైసీపీ పాలన ఎలా ఉందన్నది ప్రజలు గమనించాలన్నారు. రాప్తాడు నియోజకవర్గంలో దౌర్జన్యాలు పెరిగిపోయాయని.. ఇవన్నీ పోవాలంటే మళ్లీ తెలుగుదేశం రావాలని సునీత అన్నారు…