టీడీపీ నేతల దాడిలో ఓ కానిస్టేబుల్ కన్ను పోగొట్టుకున్నారు:
చిత్తూరు కలెక్టర్ షన్మోహన్, ఎస్పీ రిషాంత్
పుంగనూరు దాడులు, కుట్రలపై పక్కా ఆధారాలు.. చిత్తూరు ఎస్పీ
పుంగనూరు ఘటనలో చంద్రబాబుపై ఏ1 ముద్దాయిగా కేసు నమోదు చేయాలి :
డిప్యూటీ సీఎం నారాయణ స్వామి
ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేందుకే టీడీపీ కుట్రలు
గాయపడిన పోలీసు కుటుంబాలకు అండగా ప్రభుత్వం
చిత్తూరు ఆగస్ట్ 08,అనంత జనశక్తి ప్రతినిధి
పోలీసుల త్యాగాన్ని గుర్తించకపోయిన పర్లేదు కానీ.. అవహేళన చేయరాదని చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డి కోరారు. పుంగనూరు ఘటనలో వాస్తవాలపై ఆయన మీడియాతో మాట్లాడారు. ‘పుంగనూరులో పోలీసులే టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టారని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. అందుకు కావాల్సిన సాక్ష్యాధారాలు మా దగ్గర ఉన్నాయి. ప్రీ ప్లాన్‌తోనే వారు పోలీసులపై దారుణంగా దాడి చేశారు. ఆనాటి ఘటనలో మా కానిస్టేబుల్ కన్ను పోయింది.’ అని ఎస్పీ రిషాంత్ రెడ్డి చెప్పారు. ఈనెల 4 వ తేదీన పుంగనూరు ఘటనలో కానిస్టేబుల్ రణధీర్ కళ్ళను శాశ్వతంగా కోల్పోవడం చాలా బాధాకరమని కలెక్టర్ సగిలి షన్మోహన్ అన్నారు. మంగళవారం నాడు ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజారక్షణలో భాగంగా కళ్ళను కోల్పోయిన కానిస్టేబుల్ కుటుంబంతో పాటు, గాయపడిన పోలీసుల కుటుంబాల్ని కూడా ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందజేయడానికి ముందుంటుందని, తెలియజేశారు. మహా నగరాల్లో సైతం వైద్య చికిత్సకు కాంస్టేబుల్ను పంపించామని అయితే కళ్ళు శాశ్వతంగా కోల్పోవడం చాలా బాధాకరమన్నారు.
*చంద్రబాబుపై ఏ1 ముద్దాయిగా కేసు నమోదు చేయాలి.. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి*
పుంగనూరు ఘటనలో టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏ1 ముద్దాయిగా కేసు నమోదు చేయాలని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి డిమాండ్ చేశారు. సీఎం జగన్ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేందుకు వారు ఈ రకమైన కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. మంగళవారం నాడు చిత్తూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం కలెక్టర్ షన్మోహన్, ఎస్పీ రిషాంత్ రెడ్డిలతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ చేస్తున్న సంక్షేమం, అభివ్రుద్ది కార్యక్రమాలను చూసి ఏం చేయలేనని భావించి ప్రభుత్వాన్ని ఏదో రకంగా అభాసుపాలు చేసేందుకు చంద్రబాబు కుట్రలు పన్నుతున్నాడన్నారు. పుంగనూరులో విధ్వంసానికి టెర్రరిస్టుల మాదిరి పథకం పన్నాడని మండిపడ్డారు. తన సభల్లో సీఎం జగన్ పై అసభ్య పదజాలాన్ని వాడుతూ వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. జగన్ ప్రభుత్వాన్ని బాధించడానికే ఇవన్నీ కుట్రలు చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పుంగనూరు పర్యటనలో భాగంగా చంద్రబాబుకు బైపాస్ లో వెళ్లడానికి రూట్ మ్యాప్ ఇస్తే.. కావాలని గొడవలు చేయడం కోసం పథకం ప్రకారం టౌన్ లోకి వచ్చి కుట్రలు చేశారన్నారు. పుంగనూరు టౌన్ లోకి వచ్చేలా చంద్రబాబు తమ కార్యకర్తల్ని రెచ్చగొట్టారని విమర్శించారు. దీంతో వారు పోలీసులపై రాళ్లు, బీర్ బాటిల్స్ తో దాడి చేశారన్నారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలనే వాళ్లు ఇలా చేశారని మండిపడ్డారు. ఆ సమయంలో ఎస్పీ గారు ఎంతో సహనంతో వ్యవహరించారని.. వారిని అభినందిస్తున్నానన్నారు. వారు కూడా వారి శైలిలో స్పందించి ఉండొచ్చు.. కానీ, అదే జరిగి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదనన్నారు. అలా జరిగి ఉంటే ప్రభుత్వం నిందలు వేయొచ్చని వారు పథకం రచించినట్లు తెలిపారు. కానీ పోలీసులు ఎంతో సంయమనంతో వ్యవహరించారు.
ఈ దాడిలో 50 నుంచి 60 మంది పోలీసులు గాయపడ్డారని.. వారిలో ఒక డీఎస్పీ కూడా ఉన్నారన్నారు. చంద్రబాబుపై A1 ముద్దాయిగా కేసు నమోదు చేయాలని డిప్యూటీ సీఎం నారాయణస్వామి జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డితో విజ్ఞప్తి చేశారు. పుంగునూరు ఘటనకు, ముఖ్య కారకుడు చంద్రబాబే అని.. ఇది ప్రజలందరూ తెలుసన్నారు. టిడిపి కార్యకర్తలను రెచ్చగొట్టి పోలీసులపై దాడికి పూనుకున్న చంద్రబాబుపై A1 ముద్దాయిగా కేసు నమోదు చేయాలన్నారు. చంద్రబాబు చరిత్రే నీచమైన చరిత్ర అని.. అభివ్రుద్ది కార్యక్రమాలను అడ్డుకునే చరిత్ర చంద్రబాబుదన్నారు. ఈ దాడిలో గాయపడిన పోలీసుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు.