రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలకు సంక్షేమ సొబగులు.. మన్యం, అల్లూరి ప్రాంతాల్లో 4జీ సేవలు
100 జియో టవర్లను ప్రారంభించిన సీఎం జగన్
డిసెంబరు నాటికి రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు: సీఎం జగన్
రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు 4జి సేవలు అందుబాటులోకి రానున్నాయి. 100 జియో టవర్స్‌ను తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ వర్చువల్‌గా ప్రారంభించారు. దీని ద్వారా 209 మారుమూల గ్రామాలకు సేవలు అందనున్నాయి. అల్లూరు సీతారామరాజు జిల్లాలో 85 టవర్లు, పార్వతీపురం మన్యం జిల్లాలో 10 టవర్లు, అన్నమయ్య జిల్లాలో 3 టవర్లు, వైయస్సార్ జిల్లాలో 2 టవర్లను సీఎం ప్రారంభించారు.
రాష్ట్రంలో సెల్ సర్వీసులు లేని 5,459 ఆవాసాలకు సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం జగన్ పేర్కొన్నారు. అందుకు సహకారించిన కేంద్ర ప్రభుత్వ టెలీకమ్యూనికేషన్స్ విభాగానికి, జీయోకు, ఎయిర్‌టెల్, బీఎస్‌ఎన్‌ఎల్ అందిరికీ సీఎం ధన్యవాదాలు తెలిపారు. డిసెంబరు నాటికి రాష్ట్రంలో సెల్ సర్వీసులు లేని ఆవాసాలకు ఇంటర్నెట్ కనెక్టివిటీతో పాటు పెద్ద ఎత్తున మార్పులు రానున్నాయని పేర్కొన్నారు. దీంతో అన్ని సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్, స్కూళ్లకూ ఇంటర్నెట్ కనెక్షన్ లభిస్తుందని అన్నారు. రేషన్ పంపిణీ, ఇ–క్రాప్ బుకింగ్ కూడా సులభమవుతుందని చెప్పారు. తద్వారా రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలును అత్యంత పారదర్శకంగా, లంచాలకు, వివక్షకు తావులేకుండా అక్కచెల్లెమ్మలకు అందించగలుగుతామని తెలిపారు.
టవర్లను ఏర్పాటు చేసిన రిలయన్స్ జియో సంస్థ.. భవిష్యత్తులో 5జీ సేవలను అప్గ్రేడ్ చేయనుంది. ఈ కార్యక్రమంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ మంత్రి గుడివాడ అమర్నాథ్, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, ఐటీ సెక్రటరీ కోన శశిధర్, రిలయెన్స్ జియో ప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏఎస్‌ఆర్ జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, అధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. తద్వారా ఆయా ప్రాంతాల్లోని గిరిజనులతో సీఎం జగన్ ఇంటరాక్ట్ అయ్యారు.
ఈ ప్రాజెక్టు కింద కొత్తగా 2,704 ప్రాంతాల్లో టవర్ల ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం ఇప్పటికే 2,363 చోట్ల స్థలాలు ప్రభుత్వం అప్పగించింది. డిసెంబర్ నాటికి అన్ని ప్రాంతాల్లో టవర్లు ఏర్పాటుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది.